Type Here to Get Search Results !

తెలుగు భాషా దినత్సవం 2022


Telugu Bhasha Dinotsavam 2022: తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి.. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో.. అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంతే కృషి చేశారు. నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా..
జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా.. ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.

ఇంగ్లాండ్‌ నుంచి వచ్చి.. ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు..? ఒక సారి ఆలోచించండి.
భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం.ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి. 'చందమామ రావే.. జాబిల్లి రావే..' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది. పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి. అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు. మన పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు. మరి మనం ఏం చేస్తున్నాం..?


తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు. అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.

రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు. సురవరం ప్రతాప రెడ్డి దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి.. ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు. ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది. అతి సులభతరమైన ప్రపంచ భాషలలో మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది. కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం
గిడుగు గురించి క్లుప్తంగా:
గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కాలేదు.
గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.
పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.
1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...