Type Here to Get Search Results !

సీపీఎస్‌ రద్దు చేస్తే ప్రభుత్వాలను నడపలేం

*🔳సీపీఎస్‌ రద్దు చేస్తే ప్రభుత్వాలను నడపలేం*

Published: Sat, 25 Jun 2022 03:44

*2035 నాటికి మోయలేని భారమవుతుంది*

*అందుకే జీపీఎస్‌ను ఉద్యోగులకు ఇస్తామన్నాం*

*కేబినెట్‌ భేటీలో ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు*

*దుల్హన్‌కు శాచ్యురేషన్‌ విధానం వర్తించదు*

*లెక్కలు తీశాక ఈ పథకంపై ప్రకటన చేస్తా*

*నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలకు 2కోట్లు*

*దుల్హన్‌పై ‘ఆంధ్రజ్యోతి’ కథనం కేబినెట్‌లో ప్రస్తావన*

*‘గడప...’ కష్టాలు ఏకరువుపెట్టిన మంత్రులు*

*ఉద్యోగులకు జగన్‌ షాక్‌...*

అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగులకు సీఎం జగన్‌ షాక్‌ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుచేస్తే 2035 నాటికి పింఛన్ల భారం మోయలేక ప్రభుత్వం నడపడమే కష్టమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తేల్చిచెప్పారు. ఈ భారం నుంచి ఉపశమనం కోసమే గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను (జీపీఎస్‌) ప్రవేశపెడతామని చెబుతున్నామని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తే.. జీపీఎ్‌సను అమలు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గుతోందంటూ ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మైనారిటీలకు వంచన’ శీర్షిక పేరిట ప్రచురితమైన కథనంతోసహా, ఇదే అంశంపై వచ్చిన పలు కథనాలు కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అధికారిక అజెండా అంశాలపై కేబినెట్‌ తీర్మానాలు పూర్తయ్యాక, మంత్రులతో సీఎం జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు.. మరీ ముఖ్యంగా మైనారిటీలకు ప్రయోజనం కలిగించే దుల్హన్‌ పథకాన్ని అమలు చేయలేమంటూ న్యాయస్థానంలో ప్రభుత్వం అంగీకరించడంపైనా చర్చకు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 

మొత్తంగా సంక్షేమ పథకాలపై, అందులో ప్రధానంగా దుల్హన్‌ పథకం విషయంలో మైనారిటీలు వంచనకు గురయ్యారంటూ వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి పెదవివిప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నవరత్నాల పేరిట 95 శాతం వరకూ అమలు చేస్తున్నామని మంత్రులకు వివరించారు. సంక్షేమ పథకాలను శాచ్యురేషన్‌ విధానంలో అమలు చేస్తున్నామని చెప్పారు. దుల్హన్‌ పథకాన్ని ఆ విధానంలో అమలు చేయడం సాధ్యం కాదని సీఎం వెల్లడించారు. దుల్హన్‌ పథకాన్ని 2017, 2018లో చంద్రబాబు ప్రభుత్వం 19,000 మందికి వర్తింపజేయకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. దాన్ని పూడ్చుకుంటూ.. కొత్తగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకాన్ని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టినప్పుడు పత్రికలు రాయలేదని.. ఇప్పుడు మాత్రం వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను వంచించందంటూ ప్రచారం చేస్తున్నాయంటూ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మైనారిటీలకు ఆగిన విదేశీ విద్యా పథకం అంశంపైనా ఆయన స్పందించారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం అర్హత లేకున్నా 4000 మందికి విదేశీ విద్య పథకంలో లబ్ధి చేకూర్చింది. 
వీసా అనుమతులు లేకున్నా 870 మందికి లబ్ధి చేకూర్చినట్లుగా చూపుతూ నిధులు బొక్కేశారు.  దీనిపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే’’ అని అధికారులను సీఎం జగన్‌ అదేశించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని సీఎం జగన్‌  అన్నారు. దుల్హన్‌ పథకంతో సహా ఇతర పథకాలపై లెక్కలను తీశాక.. శాచ్యురేషన్‌ విధానంలో అమలు చేస్తామన్నారు. అన్ని లెక్కలూ తీశాక .. దుల్హన్‌, విదేశీ విద్యా పథకం సహా.. ఇతర పథకాలనూ అమలు చేయడంపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 
అందుకే వెనక్కి...ఎన్నికల హామీల్లో పేర్కొన్నట్లుగా .. సీపీఎస్‌ రద్దు చేయడంలో వెనకడుగు వేయడానికి గల కారణాలను మంత్రులకు సీఎం జగన్‌ వివరించారు. ‘‘సీపీఎస్‌ రద్దు చేస్తే ఉద్యోగుల పింఛన్ల భారం ప్రభుత్వంపై పడుతుంది. అలాచేస్తే 2035 నాటికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ప్రభుత్వాలు నడపలేవు. అందుకోసమే ఉభయకుశలోపరిలా ఉండేలా జీపీఎస్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమని ఉద్యోగ సంఘాలకు వివరించాం’’ అని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని మంత్రులను జగన్‌ అదేశించారు. ఎమ్మెల్యేలందరూ కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు .. అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు నిలదీస్తున్నారని సీఎం దృష్టికి పలువురు మంత్రులు తీసుకువచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కింద రెండు కోట్ల రూపాయలను విడుదల చేయాలని కోరారు. కలెక్టర్ల వద్ద ఐదు కోట్ల రూపాయలను నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఉంచుతామని .. వాటిని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.
 అయితే.. కలెక్టర్‌ వద్ద ఐదు కోట్లను ఉంచుతూనే .. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రెండు కోట్లను విడుదల చేయాలని మంత్రులు కోరాగా, సీఎం జగన్‌ సరేనన్నారు. కలెక్టర్ల వద్ద ఉంచే ఐదు కోట్ల రూపాయలను రెండు దఫాలుగా పది కోట్ల రూపాయలను మంజూరు చేయాలని కోరగా, అంద ుకూ ఆమోదించారు. శ్మశాన వాటికలకు భూ ములు కేటాయించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ కేబినెట్‌లో ప్రస్తావించారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ .. కేవలం హిందువులకే కాదని .. ముస్లింమైనారిటీలకూ .. క్రిస్టియన్లకూ శ్మశాన వాటికల కోసం భూములు కేటాయించాలన్నారు. ప్రైవేటు స్థలంలో సమాధులు కట్టుకున్నా ఫర్వాలేదని, కానీ ప్రభుత్వం భూములు ఇచ్చిన శ్మశాన వాటికల్లో సమాధులు నిర్మించడం వల్ల తొందరగా అవి నిండిపోతున్నాయని మంత్రి కొట్టు అన్నారు. ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికల్లో సమాధులు నిర్మించకుండా చూడాలని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సమాధుల నిర్మాణంలో ఎవరి సెంటిమెంట్లువారివి కదా అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...